వ్యాపారం
13 వార్తలు కనుగొనబడ్డాయి
వ్యాపారం
హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్
--ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు విశిష్ట స్థానం కల్పించే మహత్తర ఉద్యమం--దేశీయ పర్యాటకాభివృద్ధితో ఆర్థిక పురోగతి – ఉపాధి విస్తరణ – సాంస్కృతిక వైభవ ప్రాచుర్యమే లక్ష్యం--రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్అమరావతి, మే 20: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏడాది పాటు కొనసాగే సమగ్ర పర్యాటక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోనుందని మంత్రి స్పష్టం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక భవిష్యత్తుకు పునాది వేసే మహత్తర యత్నమన్నారు. ప్రభుత్వం, భాగస్వామ్య వర్గాలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టగలం అనే సంపూర్ణ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రి కేయులతో మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరియు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన పొదుపు, విదేశీ పర్యటనల నియంత్రణతో పాటు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని పర్యాటక పరంగా విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఏడాది ఏడాదికీ పెరుగుతుండగా, విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చే సంఖ్య తక్కువగా ఉండటం వల్ల దేశ సంపద విదేశాలకు వెళ్తోందన్నారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, విశ్రాంతి పర్యటనలు, వినోద యాత్రల కోసం భారతీయులు విదేశాలకు అధికంగా వెళ్తున్నారని, ఆ ధోరణిని మార్చి దేశీయ పర్యాటకాన్ని ప్రజాదరణ పొందేలా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసి “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విశిష్ట పర్యాటక ప్రదేశాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు దేశీయ పర్యాటకులను ఆకర్షించే కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అద్బుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని గండికోట వంటి “భారతదేశ గ్రాండ్ క్యానియన్”గా గుర్తింపు పొందిన ప్రదేశం నుంచి విశాఖపట్నం సముద్రతీర సౌందర్యం వరకు, అమరావతి ఆధ్యాత్మిక వైభవం నుంచి తిరుపతి భక్తి పర్యాటకం వరకు, మన్యం ప్రాంతాల సహజ అందాలు నుంచి గోదావరి–కృష్ణా–పెన్నా నదీ పరివాహక ప్రాంతాల సాంస్కృతిక సంపద వరకు ఆంధ్రప్రదేశ్ అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నప్పటికీ, శ్రీశైలం, పంచారామాలు, నవ వైష్ణవ క్షేత్రాలు వంటి అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను సమగ్ర యాత్రా మార్గాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సమగ్ర పర్యాటక వలయాల నమూనాను అమలు చేస్తామని తెలిపారు.అదేవిధంగా గమ్యస్థాన వివాహాల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. తిరుపతి, అరకు లోయ, విశాఖపట్నం సముద్రతీరాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో వివాహ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, పెట్టుబడి సదస్సులు, వ్యాపార సమావేశాలకు అనుకూలంగా సమావేశ–ప్రదర్శన కేంద్రాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని వ్యాపార–పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు రాష్ట్ర పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ప్రవాస తెలుగు కుటుంబం కనీసం ఐదు విదేశీ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఆహ్వానించినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విశేష బలం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక విధానంలో భాగంగా పలు పర్యాటక వలయాలను రూపొందించిందని, వసతి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలోనే 42 హోటల్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి దాదాపు 9,500 కొత్త గదుల సామర్థ్యాన్ని కల్పించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.సాహస పర్యాటకం, సముద్రతీర పర్యాటకం, అనుభూతి కేంద్రాలు వంటి రంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విశాఖపట్నం, చీరాల వంటి ప్రాంతాల్లో కొత్త సాహస క్రీడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.విమాన, రైలు, రహదారి, జలమార్గ అనుసంధాన పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ స్థితిలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప విమానాశ్రయాలతో పాటు త్వరలో గుంటూరు సమీపంలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందన్నారు.పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంటూ, ఆలయాలు మరియు పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంపొందించామని తెలిపారు. సేవల నాణ్యతను ఆధునీకరిస్తూ పర్యాటకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో హోటల్ సంఘాలు, పర్యాటక నిర్వహణ సంస్థలు, వినోద పార్కుల నిర్వాహకులు, వివాహ వేడుకల ప్రణాళికకర్తలు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు మరియు ఇతర భాగస్వామ్య వర్గాలతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న భాగస్వామ్య వర్గాలు ప్రభుత్వ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయని మంత్రి వెల్లడించారు. హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రాయితీ ధరలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయని, పర్యాటక నిర్వహణ సంస్థలు వివిధ ప్రాంతాలను అనుసంధానించే ప్రత్యేక యాత్రా ప్యాకేజీల రూపకల్పనపై ముందుకు వచ్చాయని తెలిపారు. ఒకరోజు పర్యటనకు వచ్చే సందర్శకులను రెండు–మూడు రోజులపాటు రాష్ట్రంలోనే ఉండేలా ఆకర్షణీయ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ మధ్యప్రాచ్య మరియు అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ పర్యటనలను తగ్గించి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విదేశీ మారకద్రవ్య పొదుపుతో పాటు దేశీయ ఉపాధి అవకాశాలు పెంపొందించడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది భారత్‌కు 90 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాగా, 3.4 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లిన విషయాన్ని ఆయన వెల్లడిచేస్తూ ముఖ్యంగా గమ్యస్థాన వివాహాల కోసం విదేశాలకు వెళ్లే ధోరణిని మార్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలో “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏడాది పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించి, దేశీయ పర్యాటకులను ఆకర్షించేందుకు సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంపై నిర్వహించిన భాగస్వామ్య వర్గాల సమావేశంలో హోటల్ యాజమాన్యాలు, ప్రయాణ నిర్వహకులు, వివాహ వేడుకల ప్రణాళికకర్తలు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితర రంగాలకు చెందిన ప్రతినిధులు దాదాపు 200 మంది ప్రత్యక్ష మరియు వర్చువల్ విధానంలో పాల్గొని తమ విలువైన సూచనలు అందజేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పద్మావతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మత్స్యకారుల ఖాతాలో 27.19 కోట్లు జమ
విశాఖపట్నం మే 18:- మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో13,597 మందికి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ జి .విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ యాదవ్, కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధభృతి కింద మత్స్యకారులకు జిల్లాలో 27 కోట్ల 19 లక్షల 40 వేలు మెగా చెక్కును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం వేట నిషేధ భృతి కింద కుటుంబానికి 20వేల వంతున విడుదల చేసింది అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 1500 మంది లబ్ధిదారులను చేర్చినట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు మెకానైస్డ్ బోట్లలో పనిచేసే సిబ్బంది 6గురికి మాత్రమే జీవన భృతి వర్తించగా ప్రస్తుతం 8 నుండి 10 మంది వరకు ఈ పథకంలో చేరుస్తున్నామన్నారు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వారిని కూడా గుర్తించి ఈ పథకంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మణరావు, మత్స్యకార బోట్ల ఓనర్లు, మత్స్యకారులు పాల్గొన్నారు.
రేషన్ పంపిణీకి సీడీబీసీ విధానం
--విజయవాడ, విశాఖల్లో త్వరలో అమలు--మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం --మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి న్యూ ఢిల్లీ :రేషన్ పంపిణీకి గుజరాత్‌లో అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాడ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని త్వరలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో అమల్లోకి తేనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన మంగళవారం దిల్లీలో తమ శాఖ సమస్యలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషితోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘చౌకధరల దుకాణాల ద్వారా అందించే బియ్యం, పంచదారలాంటి వస్తువులను గుజరాత్ తరహాలోనే మేం కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రికి చెబితే సానుకూలంగా స్పందించారు. ఈ కొత్త విధానం కింద ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ వ్యాలెట్ ప్రారంభిస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్రంలోని 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లకు అందిస్తున్న సన్న బియ్యం స్థానంలో ఈ ఏడాది నుంచి నాణ్యమైన స్టీమ్ బియ్యం అందించాలనుకుంటున్నామని చెప్పగా కేంద్ర మంత్రి అంగీకరించారు. రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో 2 లక్షల టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మరో రెండు లక్షల టన్నుల అదనపు సేకరణకు కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. వినియోగదారులకు తక్కువ ధరలకే సరకులు అందించేందుకు రాష్ట్రంలో వెయ్యి మినీమార్టులు ఏర్పాటు చేయడానికి, దేశంలోని అన్ని మిలిటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ విక్రయించేందుకు నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్) అంగీకరించింది. చమురుసంస్థలు, పౌరసరఫరాల శాఖ మధ్య సమాచారలోపం కారణంగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, ఎల్‌పీజీ కొరత వచ్చిందంటూ కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదించాం’అని మనోహర్ చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ సీడీబీసీ?కేంద్రం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సబ్సిడీ రూపంలో అందిస్తున్న మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన డిజిటల్ రూపాయి రూపంలో లబ్ధిదారుల ఖాతాలకు పంపుతుంది. బియ్యం, పంచదార, ఇతర వస్తువులపై అర్హులైన కుటుంబాలకు నెలవారీగా అందించే సబ్సిడీ మొత్తాన్ని.. రేషన్‌కార్డులతో అనుసంధానమైన ఫోన్లలో డిజిటల్ వ్యాలెట్లు ఏర్పాటు చేసి, దానిలో జమ చేస్తుంది. దీంతో ఆ రేషన్ దుకాణంలో లభించే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. బయోమెట్రిక్స్ వేయాల్సిన అవసరం ఉండదు. లావాదేవీల వేగం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి తమకు ప్రతి నెలా ఎంత సబ్సిడీ అందుతుందో వినియోగదారులకు స్పష్టంగా తెలుస్తుంది. రేషన్ డీలర్లకు మార్జిన్లూ రియల్‌టైమ్‌లో అందుతాయి.
అల్లుడికి వెండి చెప్పులు.
మహారాష్ట్ర : వెండి ధర ఆకాశాన్నంటుతున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన అల్లుడి కోసం కిలోన్నర వెండితో ప్రత్యేకంగా రూపొందించిన కొల్హాపురి చెప్పులను కానుకగా అందజేశాడు. ఈ పాదరక్షల కోసం దాదాపు రూ.4 లక్షలకుపైగా ఖర్చుపెట్టారు. కొల్హాపుర్ కు చెందిన ప్రముఖ చర్మకారుడు విక్రాంత్ మాలి దాదాపు ఎనిమిది రోజులు శ్రమించి ఈ ప్రత్యేక చెప్పులను రూపొందించాడు.
ఎరువుల అక్రమ రవాణాపై అచ్చెన్నాయుడు సీరియస్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు. ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులకు అవసరమైన సమయంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు, ప్రత్యేక దళాల నిఘాను మరింత పెంచాలని సూచించారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే సంబంధిత డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఇక, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
ఏమి టీ ఈ అనుభూతి --ఆంధ్రా లోను టీ సాగుకు అనుకూలం
( -- మే 21 ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా ప్రత్యేకం ) టీ తాగితే ఆ అనుభూతే వేరబ్బా.. టీ తాగితే మనిషికి ఉత్సాహం.. మనసుకు ఉల్లాసం కలుగుతుంది. అందుకే ప్రపంచంలో టీ ప్రియులు అధికంగా ఉన్నారు. మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఒక్కరోజు 370 కోట్ల టీ కప్పులు ఖాళీ అవుతున్నాయని అంచనా. ఇండియాలో రోజుకు 120 కోట్ల కప్పుల టీ ఆస్వాదిస్తున్నట్టు కొన్ని సర్వేలలో తేలింది.టీ కి చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. చైనాలో ప్రారంభమై భారతదేశంలో విస్తరించింది. ఇది ఒక సంస్కృతి, స్నేహం, ఆరోగ్యానికి ప్రతీక. లక్షలాది మందికి ఉపాధి ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులు ఆనందంగా జరుపుకునే రోజు ఇంటర్నేషనల్ టీ డే. చాయ్ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం లేచిన వెంటనే..సాయంత్రం రిలాక్స్ అవ్వాలంటే టీ తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రత్యేక రోజున టీ కి ఉన్న ప్రాముఖ్యతను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.టీ చరిత్ర :టీ కి చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. సుమారు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల ముందు ఆసియాలో టీ మొదలైంది. మొదట్లో ఇది ఒక ఔషధంగా వాడేవారు. ఆ కాలంలో టీ అంటే ఇప్పటిలా కాకుండా మసాలాలు కలిపిన రుచి ఉండేది.తర్వాత చైనా చక్రవర్తి షేన్ సంగ్ టీ ఆకులు ఉపయోగించడంతో ప్రారంభమైంది. అడవిలో తాగునీరు మరగబెడుతుండగా దగ్గరలో ఉన్న చెట్ల నుండి టీ ఆకులు ఆ నీటిలో పడగా మరిగిన ఆ నీరు రుచిగా ఉండటంతో పాటు ఉత్సాహాన్ని కలిగించటంతో అక్కడి నుంచి టీ ప్రపంచానికి పరిచయం అయింది. మొదట్లో ఔషధంగా వాడిన ఈ టీ కాలక్రమంలో అలవాటుగా మారింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలంలో టీ సాగు ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశం.. ప్రపంచంలో పెద్ద టీ ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత కేఫేలు పెరగడంతో టీ తాగే అలవాటు ఇంకా ఎక్కువైంది.టీ ఒక సంస్కృతి, సంప్రదాయం, అనుబంధాలకు ప్రతీక. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో టీతో ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. జపాన్‌లో టీ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. ఇంగ్లాండ్‌లో టీ పార్టీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగ్లాండ్ చార్లెస్ రాజ్ టీ ని ఎంతో ఇష్టపడే వారట.టీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది. అలసట తగ్గిస్తుంది. అలాగే మనుషులను కలుపుతుంది. కుటుంబం, స్నేహితులు కలిసి కూర్చొని టీ తాగడం ఒక మంచి అనుభూతి ఇస్తుంది. మసాలా టీ, ప్రీమియం టి,అల్లం టీ,ఇరానీ టీ,పుదీనా టీ, గ్రీన్ టీ, ఇలా పరివిధాలుగా దీనిని ఆస్వాదిస్తారు. కమ్మని తేనీరుఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లక్షలాది మంది రైతులు, కార్మికులు టీపై ఆధారపడి జీవిస్తున్నారు. టీ వ్యాపారం దేశాల మధ్య వాణిజ్యాన్ని కూడా పెంచుతుంది.మన రోజువారీ జీవితంలో భాగమైన ఈ చిన్న కప్పు టీ ఎంత గొప్పదో తెలియజేసేందుకు మే 21న వరల్డ్ టీ డే ను జరుపుకుంటారు. భారతదేశంలో టీ సాగు కు ప్రాముఖ్యత : భారతదేశంలో అస్సాం, డార్జిలింగ్, నీలగిరి ప్రాంతాల్లో ఎక్కువగా తేయాకు పంటను వేస్తారు. దేశంలో 50 శాతానికి పైగా టీ పంట ఒక్క అస్సాం రాష్ట్రంలోనే దిగుబడి అవుతుంది. అస్సాంలో ఎక్కువగా దిగుబడి కాగా డార్జిలింగ్ లో అంతకంటే తక్కువగా దిగుబడి వస్తుంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 17% టీ దిగుబడి కాగా కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే టీ పంట దిగుబడి అవుతుంది. సముద్ర నీటిమట్టానికి 1000 నుండి 2000 అడుగుల ఎత్తులో ఉన్న కొండవాలు ప్రాంతాల్లో ఆమ్ల నేలలు టీ పంటకు అనుకూలం. 25 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. అస్సాం బ్రహ్మపుత్ర వ్యాలీలో ఎక్కువగా టీ పంట పండుతుంది. అస్సాంలో అధికంగా 651.8 మిలియన్ కేజీల టీ ఉత్పత్తి రాగా, రెండో స్థానంలో పశ్చిమబెంగాల్లో 0.4% తో 5.30 మిలియన్ కేజీల ఉత్పత్తి జరిగింది. ఇది తక్కువ పరిమాణమే అయినప్పటికీ ప్రీమియం క్వాలిటీ గల ఉత్పత్తి కావడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ లో టీ పంట పండుతుంది, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 23.8 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. 2025 లో ప్రభుత్వ లెక్కల ప్రకారం టీ దిగుబడి 1,368,980 టన్నులు. సరిగ్గా వర్షాలు పడకపోవడం, పురుగుల మందుల ప్రభావం తో కొంత పంట నష్టం జరిగినా గత ఏడాది కంటే తేయాకు సాగు లో ఐదు శాతం పెరుగుదల నమోదయింది. టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 2024తో పోలిస్తే 2025లో మూడు శాతం అదనంగా టీ పంట దిగుబడి వచ్చింది. సహజంగా హెక్టార్ కు 1600 నుండి 3వేల కేజీల వరకు దిగుబడి వస్తుంది. దేశంలో 20 మిలియన్ కేజీల టీ ఎగుమతి ఇరాన్, ఇరాక్, చైనా లకు అవుతుంది. స్వతంత్రానంతరం 1947 లోనే భారతదేశంలో టీ బోర్డు ఏర్పాటు కాబడింది. టీ పంటకు ఆంధ్రప్రదేశ్ లోను అవకాశాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీ సాగు కు అవకాశాలు ఉన్నాయి. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కాఫీ తరహాలోనే టీ సాగుకు కూడా ప్రోత్సాహం,సహకారం అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కాఫీ సాగు జరిగిన చోట టీ పంటకు కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. తూర్పు కనుమలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు, చింతపల్లి, అనంతగిరి, గూడెం కొత్త వీధి వంటి ప్రాంతాల్లో ఐదు దశాబ్దాలుగా కాఫీ సాగు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో టీ పంట వేయటానికి కూడా అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కొంత కొండ ప్రాంతం టీ పంటకు అనుకూలమని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తక్కువ స్థాయిలో పలుచోట్ల టీ సాగు కొనసాగిస్తున్నారు. అయితే వాణిజ్యం జరిపే స్థాయిలో టీ సాగు జరగటం లేదు. దేశంలో పలుచోట్ల టీ బోర్డుల ఏర్పాటు ను , ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇదే తరహాలో మన రాష్ట్రంలో కూడా టీ సాగు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాకాలను ప్రకటించాలి. టీ సాగు కోసం ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక పథకాలను అమలు చేయకపోవడం గమనార్హం. మన కాఫీ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రాసెసింగ్ యూనిట్లు లేవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో కాఫీ పాటు టీ ఆకు సాగు కోసం తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలి. కాఫీ తాగే వారి శాతం తక్కువ, టీ తాగేసి వారి శాతం ఎక్కువ. గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా సేవించేది టీ. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, ఉద్యానవన శాఖ, టీ బోర్డు సమన్వయంతో రాష్ట్రంలో ముఖ్యంగ తూర్పు కనుమల్లో టీ ఆకు సాగుకు కూడ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.
WANTED
3డి ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లోకి ఓలెక్ట్రా
హైదరాబాద్, మే 11: ప్రముఖ ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ 3డి ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించింది. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ డసాల్ట్ సిస్టమ్స్‌తో కలిసి తమ ఉత్పత్తి అభివృద్ధి వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సమగ్ర డిజిటల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యవస్థను నిర్మించేందుకు ఓలెక్ట్రా కీలక అడుగు వేసినట్లయింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వేగవంతమైన ఆవిష్కరణలకు ఆధునిక డిజిటల్ సాంకేతికత అవసరాన్ని గుర్తించిన ఓలెక్ట్రా, ఈ నిర్ణయం ద్వారా తమ ఇంజనీరింగ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఓలెక్ట్రాకు ఉన్న నాయకత్వం, వర్చువల్ ట్విన్ టెక్నాలజీ, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఇంజనీరింగ్‌లో డసాల్ట్ సిస్టమ్స్‌కు ఉన్న నైపుణ్యం కలిసిరానుంది. దీని ద్వారా , భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ విధానాలను కొత్త స్థాయికి వెళ్లనున్నాయి.3డి ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫారం ద్వారా సిబ్బంది, డేటా, డిజైన్, సిమ్యులేషన్, తయారీ ప్రక్రియలన్నీ ఒకే సమగ్ర వేదికపై అనుసంధానమవుతాయి. దీని ద్వారా బస్సు ఉత్పత్తి ప్రారంభ దశ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే వరకు పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది. దీంతో ఓలెక్ట్రా సంప్రదాయ పద్ధతుల నుంచి మోడల్ ఆధారిత, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉత్పత్తి అభివృద్ధి విధానానికి మారి ప్రపంచ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు అనుసరిస్తున్న ప్రమాణాలకు చేరువైంది. ఈ భాగస్వామ్యంతో ఓలెక్ట్రాకు పూర్తిస్థాయి డిజిటల్ ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యం లభించనుంది. ఇంజనీరింగ్, తయారీ విభాగాలు, సరఫరాదారులు , ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరింత సులభతరం అవుతుంది. భౌతిక నమూనాలను తయారు చేయకముందే వర్చువల్ సిమ్యులేషన్ వాలిడేషన్ ద్వారా ఉత్పత్తులను పరీక్షించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆవిష్కరణల వేగం పెరగడం, మార్కెట్లోకి ఉత్పత్తులను త్వరగా తీసుకురావడం, భవిష్యత్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది.ఈ సందర్భంగా ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ, “మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్ ఇంజనీరింగ్ ద్వారానే రూపుదిద్దుకుంటుందని మేము నమ్ముతున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే వినూత్న పరిష్కారాల ద్వారా రవాణా రంగంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త బస్సులు, ట్రక్ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. డసాల్ట్ సిస్టమ్స్‌తో 3డి ఎక్స్పీరియన్స్ భాగస్వామ్యం , ప్లాట్‌ఫామ్ స్వీకరణ ద్వారా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా, తెలివిగా, అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులను రూపొందించే సామర్థ్యం మాకు లభిస్తుంది. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వేగంగా ముందుకెళ్తున్న ఈ సమయంలో మేము వినియోగంలోనే కాకుండా ఇంజనీరింగ్ ప్రతిభలో కూడా ముందంజలో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం” అన్నారు.డసాల్ట్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ ఎన్‌జీ మాట్లాడుతూ, “భవిష్యత్ మొబిలిటీ ముందుగా వర్చువల్ ప్రపంచంలో రూపుదిద్దుకుని తరువాత రోడ్లపైకి వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఓలెక్ట్రాతో మా భాగస్వామ్యం సమగ్ర, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఆవిష్కరణలకు దారితీసే ముందుచూపు నిర్ణయం. దీని ద్వారా వేగవంతమైన, తెలివైన, పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి సాధ్యమవుతుంది. వర్చువల్ ట్విన్ అనుభవాలు , తదుపరి తరం ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా భారత మొబిలిటీ రంగ రూపాంతరానికి మేము తోడ్పడతాం” అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ మరియు మొబిలిటీ సంస్థలు ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఆధారిత ఇంజనీరింగ్ పద్దతులను స్వీకరిస్తూ అభివృద్ధి ప్రక్రియను ప్రమాణీకరించడంతో పాటు క్లిష్టతను తగ్గిస్తూ, తదుపరి తరం వాహన నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలెక్ట్రా, డసాల్ట్ సిస్టమ్స్ భాగస్వామ్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే కీలక పరిణామంగా చెప్పవచ్చు. 3డి ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌ను తమ ఇంజనీరింగ్ వ్యవస్థలో కేంద్రంగా అమలు చేయడం ద్వారా ఓలెక్ట్రా తన డిజిటల్ సామర్థ్యాలను మరింత పెంపొందించుకొని, ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, ఇంజనీరింగ్, తయారీ మార్కెటింగ్ రంగాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది
విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట
ముంబయి : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పించేందుకు గాను కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములను 25 శాతం తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపులు కొనసాగించాలని పేర్కొంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా లకు భారీ దెబ్బ తగిలింది. ఈక్రమంలో విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని రుసుములను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా.. అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన రంగం పుంజుకుంది. ఇందులోభాగంగా ఇండిగో షేర్లు ఈరోజు ఏకంగా 10శాతం పెరిగి.. అప్పర్ సర్క్యూట్‌ని తాకాయి.
హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం
హర్మూజ్ జలసంధి వద్ద తగ్గిన ట్రాఫిక్.ప్రస్తుతం షార్జా తీరాన ఉన్న గ్యాస్ నౌకలు.హార్ముజ్ :పశ్చిమాసియా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా తీరానికి సమీపంలో ఆగి ఉన్నాయి. ఇవి వంట గ్యాస్‌ను మోసుకెళ్లే నౌకలు. గత 24 గంటలుగా ఈ మార్గంలో చమురు రవాణా చేసే ఓడలేవీ కదలలేదు. కానీ… తాజా సమాచారం ప్రకారం ఈ రెండు భారతీయ నౌకలు శనివారం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నౌకల కదలికలను గమనించే సాఫ్ట్‌వేర్ల ద్వారా ఈ విషయం బయటపడింది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ మార్గం గుండానే వెళ్లాలి. కానీ.. ఇరాన్ హెచ్చరికల వల్ల ఇక్కడ రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా ఆంక్షలు ఉన్న ఒక ఖాళీ నౌకను కూడా ఇరాన్ వెనక్కి పంపించేసింది. ఇలాంటి సమయంలో మన నౌకలు ముందుకు వెళ్లడం అనేది చాలా కీలకమైన విషయం.మన దేశానికి చెందిన దాదాపు 22 నౌకలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. మన ఓడల భద్రత విషయంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. ‘మా నౌకలు సురక్షితంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించాలని మేము కోరుకుంటున్నాము’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాల నాయకులతో ఈ విషయంలో మాట్లాడుతున్నారు.గత వారంలో కూడా ఇరాన్ ప్రభుత్వం మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలను వెళ్లడానికి అనుమతించింది. దీనిని బట్టి చూస్తుంటే.. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ నౌకలకు కొంత మినహాయింపు దొరుకుతుందని అర్థమవుతోంది. ఒకవేళ ఇప్పుడు ఈ రెండు నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తే, రాబోయే రోజుల్లో మిగిలిన వ్యాపార నౌకలు కూడా ధైర్యంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.