ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, సుమారు 13కిలోల గంజాయి స్వాధీనం
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
విజయనగరం : జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్, గుట్కాలు అక్రమ రవాణ నియంత్రణకు మరియు అనుమానస్పద వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొనేందుకు ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం ప్రయాణికులతో రద్దీగా వెళ్లే పాసింజరు ట్రెయిన్ నంబరు /58531 ను లక్ష్యంగా చేసుకొని మే 21న ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, ప్రేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకు, అనుమానస్పద వ్యక్తులను అదువులోకి తీసుకొనే లక్ష్యంతో ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయిన్ /58531లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ తెలిపారు.
చీపురుపల్లి రైల్వే స్టేషను నుండి నెల్లిమర్ల రైల్వే స్టేషను వరకు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడుతో ట్రెయిన్లోని అన్ని కంపార్టుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ప్రయాణికుల బ్యాగులు, వస్తువులను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నహాయంతో పరిశీలించారు. చీవురుపల్లి రైల్వే స్టేషనులో బ్రహ్మపుర విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయినును లక్ష్యంగా చేసుకొని పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీల్లో ట్రైన్ లో ప్రయాణించే పాసింజర్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, ఒక్కొక్క కంపార్టుమెంటును పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీలు చేపట్టే సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రైన్ ను చీపురుపల్లి రైల్వే స్టేషనులో ఎక్కువ సమయం నిలిపివేయకుండా, పోలీసు అధికారులు, సిబ్బంది నెల్లిమర్ల రైల్వే స్టేషనుకు చేరేంత వరకు ట్రైన్లో ప్రయాణించి, ప్రయాణికుల బ్యాగులు, లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసామన్నారు.
ఈ తనిఖీల్లో ఈగల్, జిఆర్పీ, సివిల్, ఎస్టీఎఫ్, బాంబ్ డిటెక్షన్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా పాల్గొన్నాయి. ఈ తనిఖీలు చేపట్టే ముందు ట్రైన్లో చేపట్టాల్సిన విధుల గురించి చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు చీపురుపల్లి రైల్వే స్టేషను వద్ద రైడ్స్ లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, ఎస్టీఎఫ్, బాంబ్, డాగ్ స్క్వాద్ బృందాలకు దిశా నిర్ధేశం చేసారు. ఈ తరహా అకస్మిక తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగించి, నేర నియంత్రణకు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణకు పాల్పదుతున్న ఇద్దరు వ్యక్తులను (1) కేరళ రాష్ట్రం కసర గాడ్ జిల్లా పారిపురం పోస్టు కొడవలుం గ్రామానికి చెందిన కొడవలం దేవినాధ్ (21 సం.లు) (2) కేరళ రాష్ట్రం యర్నాకులం జిల్లా కుట్టంపుజా పోస్టు వట్టటుపర గ్రామానికి చెందిన ఏదోతా పటమాటు జోసెఫ్ (21 సం.లు) అదుపులోకి తీసుకొని, వారివద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం పలాస జి.ఆర్.పి. పోలీసులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. తోటి ప్రయాణికులు పోలీసుల చర్యలను అభినందించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ తనిఖీలలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, ఎస్ఐలు లోకేశ్వరరావు, లోకేష్, నారాయణరావు, మధుసూధనరావు, స్వీటీ, ఆర్పీఎఫ్, ఈగల్, ఎస్టీఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.
మొదటి వ్యాఖ్య రాయండి!